సీనియర్ నటుడు, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడు మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయనకు వైద్యులు చిన్న శస్త్రచికిత్స నిర్వహించారు. తాను ఆసుపత్రిలో చేరిన విషయాన్ని బయటపెట్టకూడదని మిథున్ భావించినప్పటికీ, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం ఆసుపత్రికి వెళ్లిన సువేందు అధికారి, మిథున్ చక్రవర్తిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఫేస్‌బుక్‌లో మిథున్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడిన సువేందు, మిథున్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆయన డిశ్చార్జి అవుతారని వెల్లడించారు.

మిథున్ చక్రవర్తి అనారోగ్యంపై టీఎంసీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. పట్నాలో మీడియాతో మాట్లాడుతూ, మిథున్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మిథున్ చక్రవర్తికి ప్రజల ప్రేమ, ఆశీస్సులు దక్కాలని ఆయన కోరారు.

ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయాభిలాషులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.