ఢిల్లీలో గురువారం జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ ఫైనల్స్ సిరీస్‌లో లాంగ్ జంప్ పోటీలో యాన్సీ సోజన్ విజయం సాధించింది. ఆసియా క్రీడలకు ముందు ఇదే తన చివరి పోటీ అని, జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం గెలవడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొంది.
తన తండ్రి సోజన్ ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నారని, ఆయనకు బంగారు పతకాన్ని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నానని యాన్సీ తెలిపింది. గతంలో చాలామంది తాను ఏమీ సాధించలేనని విమర్శించేవారని, తన తండ్రి కూడా మన పేరు మీద ఏ రికార్డు లేదని బాధపడేవారని ఆమె గుర్తుచేసుకుంది.
కేరళలోని త్రిశూర్ జిల్లా నట్టిక గ్రామానికి చెందిన యాన్సీ 2001, మార్చి 1న జన్మించింది. ఆమె తల్లి జాన్సీ కూడా అథ్లెట్ కావడంతో చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. ఏడవ తరగతి నుంచే ఆమెకు క్రీడల్లో శిక్షణ మొదలైంది.
ప్రారంభంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెాల్లో పాల్గొన్న యాన్సీ, తరచూ గాయాల బారిన పడటంతో లాంగ్ జంప్‌పై దృష్టి సారించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన చికిత్స, పోషకాహారం అందకపోయినా పట్టుదలతో ముందుకు సాగింది. 2019లో తొలిసారి జాతీయ స్థాయిలో లాంగ్ జంప్ రికార్డును ఆమె నమోదు చేసింది.
అంతర్జాతీయ వేదికలపై కూడా యాన్సీ తన సత్తా చాటింది. 2022 ఆసియా క్రీడల్లో రజతం, 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలను ఆమె గెలుచుకుంది. 2026 మే నెలలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో 6.75 మీటర్ల దూరం దూకి తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును సొంతం చేసుకుంది.
ప్రస్తుతం జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు యాన్సీ సిద్ధమవుతోంది. తన కష్టానికి ప్రతిఫలంగా బంగారు పతకాన్ని సాధించి, తండ్రికి కానుకగా ఇవ్వాలనే పట్టుదలతో ఆమె శిక్షణ కొనసాగిస్తోంది.








