గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష కొనియాడారు. ముఖ్యంగా బాక్సింగ్‌లో ఏడు స్వర్ణాలు సాధించడం గొప్ప విషయమని ఆమె పేర్కొన్నారు. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
అయితే, ఈ పతకాలను చూసి మురిసిపోవద్దని పీటీ ఉష అథ్లెట్లను హెచ్చరించారు. కామన్‌వెల్త్ గేమ్స్ ముగిసిన కొద్ది రోజులకే ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయని, అక్కడ అసలైన సవాల్ ఎదురవుతుందని ఆమె గుర్తు చేశారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనని చైనా, జపాన్ వంటి దేశాలు ఆసియా క్రీడల్లో పోటీలో ఉంటాయని, కాబట్టి పతకాల కోసం మన అథ్లెట్లు మరింత గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె వివరించారు.
ఈసారి కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి రెజ్లింగ్, షూటింగ్ వంటి భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టే క్రీడలను తొలగించడం మనపై ప్రభావం చూపింది. అయినప్పటికీ బాక్సర్లు ఏడు స్వర్ణాలు, మూడు రజతాలతో తమ సత్తా చాటారు. పీటీ ఉష వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒలింపిక్స్ లేదా కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించని వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
ఆదివారం క్రీడలు ముగియనున్న నేపథ్యంలో, భారత అథ్లెట్లు 40 పతకాల మార్కును అందుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. కామన్‌వెల్త్‌లో చూపిన ప్రదర్శనను ఆసియా క్రీడల్లోనూ కొనసాగించి, దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావాలని పీటీ ఉష ఆకాంక్షించారు.








