ఆగస్టు 28న ప్రారంభం కానున్న మహిళల టీ20 ఆసియా కప్ పదో సీజన్‌లో మొత్తం 8 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ జట్లను చెరో నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించగా, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరియు పాకిస్థాన్ జట్లు గ్రూప్-ఎలో చోటు దక్కించుకున్నాయి.
ఈ టోర్నీలో భారత జట్టు తమ ప్రయాణాన్ని ఆగస్టు 30న థాయిలాండ్‌తో మొదలుపెడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో భాగంగా సెప్టెంబర్ 5న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ ఆల్‌రౌండర్ ఫాతిమా సనా ఈ జట్టుకు నాయకత్వం వహించనుంది. ఆసియా కప్‌తో పాటు జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్ 2026 కోసం కూడా పాకిస్థాన్ ఇదే జట్టును ఎంపిక చేసింది.
ఏషియన్ గేమ్స్ పోటీల్లో పాకిస్థాన్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 17న థాయిలాండ్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో పాక్ తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది.







