వట్టివాగు ప్రాజెక్టు నుంచి తమ పంటలకు నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ ఆందోళనతో రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఈ నిరసనలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు. కెనాల్‌ (సాగు నీటి కాలువ) ద్వారా పంటలకు నీరు అందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినా రైతులు ఆందోళన విరమించలేదు. దీంతో డీఎస్పీ అశోక్, ఆర్డీవో లోకేశ్వర్ అక్కడికి వచ్చి ఎమ్మెల్యేతో, రైతులతో చర్చలు జరిపారు.

సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. ఈ హామీతో నిరసన ముగిసింది.