ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన కోలుకునే పరిస్థితి లేదని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెహర్ న్యూస్ ఏజెన్సీ 12 సెకన్ల నిడివి గల ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో మోజ్తాబా ఖమేనీ కొందరితో మాట్లాడుతుండగా, ఆయన ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు.

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత మోజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఆయన ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పేర్కొన్నారు. మార్చి 8న మూడో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన స్వయంగా వీడియో లేదా ఆడియో సందేశాలు ఇవ్వకపోవడంతో ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందిస్తూ, మోజ్తాబాతో సంప్రదింపులు జరపడం కష్టంగా ఉన్నప్పటికీ, ఆయనతో సమావేశాలు జరిగాయని తెలిపారు. ఆయనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని పెజెష్కియాన్ ఖండించారు. అయితే, తాజాగా విడుదల చేసిన వీడియో ఎప్పుడు తీశారనే విషయంపై ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.