అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలోని కుర్లపల్లి గ్రామంలో ఈ భారీ ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. 83 మంది సభ్యులు ఉండటంతో వీరికి ప్రస్తుతం ఉన్న మూడు ఇళ్లు సరిపోక, మరో ఇంటిని నిర్మించుకుంటున్నారు. కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్పల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం సమావేశమై, ఆ రోజు చేయాల్సిన పనులను సభ్యులందరికీ కేటాయిస్తారు.

ఈ కుటుంబంలో వంట మొత్తం ఒకే చోట జరుగుతుంది. రోజుకు సుమారు 50 కిలోల బియ్యం, ఒక్కోసారి 15 కిలోల పిండి అవసరమవుతుంది. ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే వంట చేస్తూ, ఆరు తరాలుగా వస్తున్న పద్ధతులను వీరు పాటిస్తున్నారు. ఆదివారం నాన్‌వెజ్ వండుకోవాలంటే సుమారు ఒక పొట్టేలు లేదా 10 కిలోల చికెన్ అవసరమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఒకప్పుడు తీవ్ర పేదరికంలో ఉన్న ఈ కుటుంబం, ఉమ్మడిగా కష్టపడటం వల్ల నేడు 120 ఎకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉంది. మిర్చి, టమోటా, వంకాయ వంటి పంటలను పండించి, దళారుల ప్రమేయం లేకుండా సొంత వాహనాల్లో నేరుగా మార్కెట్లకు తరలిస్తారు. వ్యవసాయంతో పాటు నాలుగు ట్రావెల్స్ బస్సులను కూడా వీరు నిర్వహిస్తున్నారు.

కుటుంబంలో విభేదాలు రాకుండా ఉండేందుకు తొమ్మిది మంది యువకులకు ఒకే ముహూర్తంలో వివాహాలు జరిపించారు. ప్రస్తుతం 32 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. ఆరు తరాలుగా కొనసాగుతున్న ఈ ఉమ్మడి జీవన విధానాన్ని భవిష్యత్ తరాలు కూడా కొనసాగించాలని కుటుంబ పెద్దలు కోరుకుంటున్నారు.