‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఫేమ్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 7న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

ఈ ప్రమోషన్లలో భాగంగా రియల్ హీరో సోనూసూద్ ‘డర్టీ గ్యాంగ్‌స్టర్’ అనే పాటను విడుదల చేశారు. కేకే రాసిన ఈ పాటకు పృథ్వి చంద్ర, ఈకే గాత్రం అందించారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగే ఈ పాట సినిమాపై అంచనాలను పెంచుతోంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న సోనూసూద్ మద్దతు తెలపడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది.

ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ఇంద్రజ మధ్యతరగతి తల్లిదండ్రుల పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు ఇంద్రజ అబ్బర్, మహబూబ్‌నగర్ భాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి డావ్‌జాండ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు కీలక పాత్రలో కూడా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది.