దళపతి విజయ్ తనయుడు, 'Sigma' చిత్ర దర్శకుడు జాసన్ సంజయ్ తాజాగా తన కుటుంబ నేపథ్యం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి సంగీత ఉత్తర శ్రీలంకలో జన్మించారని, ప్రస్తుతం తమ కుటుంబానికి అక్కడ ఆస్తులు ఉన్నాయని ఆయన తెలిపారు. తన మొదటి సినిమా 'Sigma' కోసం శ్రీలంకలో షూటింగ్ చేయాలని ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదని, భవిష్యత్తులో అక్కడ షూటింగ్ చేయాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తల్లితో ఉన్న అనుబంధం గురించి చెబుతూ, తాను ఎంత ఎదిగినా అమ్మ ఇప్పటికీ తనను చిన్న పిల్లాడిలాగే చూస్తుందని జాసన్ సంజయ్ చెప్పారు. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు తనను ప్రోత్సహించేది, ధైర్యం చెప్పేది అమ్మేనని ఆయన వెల్లడించారు. సినిమాల విషయంలో అమ్మ ఇచ్చే నిజాయితీ గల అభిప్రాయాలకు తాను ప్రాధాన్యత ఇస్తానని, అందుకే తన సినిమాపై ఆమె ఇచ్చే రివ్యూ కోసం వేచి చూస్తున్నానని ఆయన తెలిపారు.

తన చెల్లెలు దివ్య సాషాతో ఉన్న బంధం గురించి మాట్లాడుతూ, చిన్నప్పుడు తామిద్దరం టామ్ అండ్ జెర్రీలా గొడవపడేవాళ్లమని, ఇప్పుడు చాలా క్లోజ్ అయ్యామని సంజయ్ చెప్పారు. ప్రస్తుతం తను సినిమాలతో, దివ్య తన హైయర్ స్టడీస్‌తో బిజీగా ఉన్నామని ఆయన వివరించారు. దివ్య ఒక బాస్కెట్‌బాల్ ప్లేయర్ అని కూడా ఆయన పేర్కొన్నారు.

క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, తాను చెన్నై సూపర్‌కింగ్స్ (CSK) జట్టుకు పెద్ద అభిమానినని సంజయ్ తెలిపారు. ఐపీఎల్ మొదటి సీజన్‌లో తన తండ్రి విజయ్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పుడు ఎంఎస్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లను కలిసిన జ్ఞాపకాలు తన జీవితంలో ప్రత్యేకమైనవని ఆయన గుర్తు చేసుకున్నారు.