అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ (AHEAD) అనే స్వచ్ఛంద సంస్థ ఈ నెల 29న మోహన్ భగవత్‌తో ‘యూనివర్సల్ వన్‌నెస్’ అనే సదస్సును ఏర్పాటు చేసింది. న్యూయార్క్ నగరంలోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఉన్న ఇన్ఫోసిస్ థియేటర్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి దాదాపు 5,000 మంది హాజరవుతారని అంచనా. అయితే, ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందు నిర్వాహక సంస్థ అయిన AHEAD ఎక్స్ ఖాతాను ఆ సోషల్ మీడియా సంస్థ నిలిపివేసింది.
ఈ పర్యటనపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ మేయర్ మామ్దానితో పాటు పలు ఇస్లామిక్ సంఘాలు ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఈ సదస్సుకు ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు మద్దతు తెలుపుతున్నారు. ఇది బహిరంగ స్వేచ్ఛ, చర్చ మరియు పరస్పర గౌరవం అనే స్ఫూర్తితో జరుగుతున్న కార్యక్రమమని ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంది. తమ సంస్థ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని వారు వివరించారు.
విభిన్న సంస్కృతులు, బహుముఖ విశ్వాసాలు కలిగిన వారెవరైనా ఈ సదస్సుకు హాజరు కావచ్చని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు AHEAD నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని వివిధ వర్గాల ప్రజల ఐక్యత కోసం, పౌర కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. వివాదాల నడుమ ఈ సదస్సు జరగాల్సి ఉండగా, నిర్వాహకుల సోషల్ మీడియా ఖాతా నిలిపివేత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.








