అమెరికా ప్రభుత్వ రుణభారం 39 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. 2008 ఆర్థిక సంక్షోభం (GFC) సమయంలో ఈ అప్పు సుమారు 9.5 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉండేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం అమెరికా బాండ్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన వివరించారు.
ప్రభుత్వ అప్పుల పెరుగుదల వేగాన్ని కియోసాకి ఒక ఉదాహరణతో వివరించారు. ఒక వ్యక్తి నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే, ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి 32 వేల సంవత్సరాలు పడుతుంది. కానీ, అమెరికా ప్రభుత్వం ప్రతి 90 రోజులకు ఒక ట్రిలియన్ డాలర్ల మేర కొత్త అప్పును సృష్టిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ధనవంతులు నగదును పొదుపు చేయరని తన పుస్తకంలోని ఆర్థిక సూత్రాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. కరెన్సీని దాచుకోవడం కంటే వాస్తవ ఆస్తులను (Real Assets) కలిగి ఉండటం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. 1965 నుంచి వెండి, 1971 నుంచి బంగారం, 2012 నుంచి బిట్‌కాయిన్, 2022 నుంచి ఎథీరియంను తాను సేకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గతంలో అమెరికా ప్రభుత్వం బంగారంపై నిషేధం విధించి స్వాధీనం చేసుకున్న చరిత్రను ఆయన ప్రస్తావించారు. అందుకే తన బంగారం, వెండి నిల్వలను స్విట్జర్లాండ్ లోని స్విస్ వాల్ట్‌లలో భద్రపరిచినట్లు తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఇది అత్యంత అనిశ్చిత కాలమని పేర్కొన్న కియోసాకి, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరారు.








