వర్షాలు తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో శనివారం ఉదయం నుంచి బల్తాల్ మార్గంలో అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రోడ్ల కారణంగా శుక్రవారం నిలిపివేసిన యాత్రను, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయడంతో అధికారులు పునరుద్ధరించారు.

మరోవైపు పహల్గామ్ మార్గంలో మాత్రం ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. వాతావరణం సరిగ్గా లేకపోవడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కూడా పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో 250 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో భాగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద భక్తులు నిలిచిపోయారు.

గత నెల 3న ప్రారంభమైన ఈ వార్షిక యాత్రలో ఇప్పటివరకు 4.5 లక్షల మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే మిగిలిన మార్గాల్లో కూడా యాత్రను తిరిగి ప్రారంభిస్తామని, ఈ నెల చివరి వరకు యాత్ర కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.