ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ అల్యూమినియం ఫాయిల్ వాడకం సాధారణమైపోయింది. ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, చికెన్, చేపలు లేదా కూరగాయలను గ్రిల్ చేయడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచడం లేదా అందులోనే వండడం వల్ల, అల్యూమినియం కణాలు ఆహారంలోకి చేరే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, అల్యూమినియం ఫాయిల్‌లో వండిన ఆహారంలో అల్యూమినియం పరిమితికి మించి చేరే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టమాటా, నిమ్మరసం, వెనిగర్ వంటి ఆమ్ల స్వభావం కలిగిన పదార్థాలు లేదా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు అల్యూమినియం పొరను కరిగించి, ఆహారంలో కలిసేలా చేస్తాయి. ఈ ప్రక్రియ ఆహారం ఎంత పుల్లగా ఉంటే అంత వేగంగా జరుగుతుంది.
శరీరంలోకి స్వల్ప పరిమాణంలో అల్యూమినియం వెళ్లినా అది బయటకు వెళ్లిపోతుంది. కానీ, చాలామంది సిఫార్సు చేసిన పరిమితికి మించి దీనిని పరోక్షంగా తీసుకుంటున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల మెదడు కణజాలంలో అల్యూమినియం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని పరిశోధనల్లో గుర్తించారు. ఇది మెదడు కణాల ఎదుగుదలపై ప్రభావం చూపడంతో పాటు, ఎముకల సంబంధిత సమస్యలను కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య భద్రత కోసం బేకింగ్ వంటి వంటకాలకు అల్యూమినియం ఫాయిల్‌కు బదులుగా గాజు లేదా పింగాణీ పాత్రలను వాడటం ఉత్తమం. అల్యూమినియం పాత్రలను వాడేవారు వాటిపై ఉండే సహజ ఆక్సైడ్ పొరను కాపాడుకోవాలి. ఒకవేళ పాత్రలను గట్టిగా రుద్ది శుభ్రం చేసినట్లయితే, అందులో నీటిని మరిగించడం ద్వారా ఆ రక్షణ పొరను తిరిగి పొందవచ్చు. ఏది ఏమైనా, అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఎక్కువసేపు నిల్వ చేయకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.








