Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో సందడి చేశారు. నగరంలోని ఇనార్బిట్ మాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఏఏ సినిమాస్‌ థియేటర్లను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, నిర్మాత సునీల్‌తో పాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి. విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. అల్లు అర్జున్ రాకతో విశాఖలోని మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఈ పర్యటనలో అల్లు అర్జున్ ప్రయాణించిన ఓ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చకు దారితీసింది. AP 40 LE 1 నంబర్ ప్లేట్‌తో ఉన్న ల్యాండ్ క్రూయిజర్‌లో అల్లు అర్జున్ ప్రయాణించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆసక్తికరంగా ఇదే కారును గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉపయోగించారు.

జూన్‌లో మంగళగిరి స్టేడియంలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి కూడా ఆయన AP 40 LE 1 నంబర్ ఉన్న ల్యాండ్ క్రూయిజర్‌లోనే వచ్చారు.. తాజాగా అల్లు అర్జున్ కూడా అదే కారులో విశాఖ పర్యటనకు రావడంతో ఈ వాహనం ఎవరిదనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. సోషల్ మీడియాలో అభిమానులు ఆరా తీయగా.. ఈ ల్యాండ్ క్రూయిజర్ మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందినదిగా సమాచారం. మెగా కుటుంబంతో గంటా శ్రీనివాసరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. విశాఖకు మెగా కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన చూసుకుంటారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ ఏపీ పర్యటనల సందర్భంగా గంటా శ్రీనివాసరావు కారును ఉపయోగించినట్లు సమాచారం. దీంతో ‘AP 40 LE 1’ కారు ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల మధ్య ఆసక్తికర చర్చగా మారింది. ఇక ఏఏఏ సినిమాస్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి ఇనార్బిట్ మాల్ వరకు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీగా జనసందోహం ఏర్పడటంతో భద్రతా కారణాల దృష్ట్యా అభిమానులను మాల్‌లోకి అనుమతించలేదు. అల్లు అర్జున్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మాల్‌కు చేరుకుని దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు. ఏఏఏ సినిమాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘పుష్ప’ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లు అర్జున్ ఆ విగ్రహం పక్కన నిలబడి ఫొటోలు దిగారు. అనంతరం తన సినిమాలకు సంబంధించిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీని కూడా సందర్శించారు.