ఐఐటి కాన్పూర్ కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బీటెక్ ప్రోగ్రామ్‌లో సీటు దక్కని విద్యార్థి, ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. తాను దరఖాస్తు చేసుకుని, ఫీజు చెల్లించి, అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా తనకు అవకాశం కల్పించలేదని, ప్రవేశ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన హ్యాకథాన్‌లో కూడా తిరస్కరించారని ఆ విద్యార్థి ఆరోపించాడు. తనకు న్యాయమైన అవకాశం కావాలని కోరుతూ, తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకే ఈ పని చేశానని చెబుతూ హ్యాకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను ఎక్స్, రెడ్డిట్ వేదికల్లో పంచుకున్నాడు.

ఈ ఘటనపై ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ మునీంద్ర అగర్వాల్ స్పందించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆ విద్యార్థికి తగిన అనుభవం లేకపోవడం వల్లే అతడిని షార్ట్‌లిస్టు చేయలేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ పూర్తయినందున, ఇప్పుడు అతనికి సీటు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

అయితే, సదరు విద్యార్థిపై మొదట పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినా, ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ఐఐటి కాన్పూర్ అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థి వాదనలను పరిశీలించి, అతని సాంకేతిక నైపుణ్యాలను స్వయంగా పరీక్షించాలని యాజమాన్యం నిర్ణయించింది. విద్యార్థిని సంస్థకు ఆహ్వానించి, అతను తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటే తదుపరి ప్రవేశ ప్రక్రియలో అవకాశం కల్పిస్తామని ఐఐటికె వర్గాలు పేర్కొన్నాయి.