మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటీవల ప్రారంభించిన 'వి ది లీడర్స్' (మేమే నాయకులం) ప్రచార కార్యక్రమం సజావుగా సాగుతోందని, దీనిని వచ్చే జూలై నెలలో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అధికారికంగా మారుస్తామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయ రంగంలో గణనీయ మార్పులకు నాంది పలకనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాంప్రదాయ వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నామలై స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడే పార్టీలో నాయకుల పదవీకాలానికి నిర్దిష్ట పరిమితులు (Term Limits) విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎవరికీ కుర్చీ శాశ్వతం కాకూడదని, పాతవారి స్థానంలో కొత్తవారికి అవకాశాలు కల్పించడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా, లండన్ వంటి దేశాల్లో రాణిస్తున్న సమర్థవంతమైన తమిళ వృత్తి నిపుణులు, సాంకేతిక నిపుణులు ఈ వేదిక ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 18 లక్షల మంది చేరారని, లక్ష్యంగా పెట్టుకున్న 50 లక్షల సభ్యుల సంఖ్యను సాధించే దిశగా పయనిస్తున్నామని అన్నామలై వెల్లడించారు. కేవలం ఆన్‌లైన్ పరిమితం కాకుండా, కార్యకర్తలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈ ఉద్యమం రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశను చూపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పూర్తి పారదర్శకతతో పనిచేస్తామని, ఎటువంటి సందర్భంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టించమని అన్నామలై హామీ ఇచ్చారు. అన్ని మతాలను సమానంగా చూస్తామని, ఓటు బ్యాంక్ రాజకీయాలకు లేదా వివక్షకు తాము దూరంగా ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. అలాగే, రాష్ట్ర యువతను పీడిస్తున్న డ్రగ్స్ వ్యసన సమస్యపై పోరాటానికి ప్రతి గ్రామం, నగరంలో భారీ అవగాహన ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. జూలై నుంచి పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా మారిన తర్వాత ఈ పార్టీ తమిళనాడు రాజకీయ సమీకరణాలను ఎలా మారుస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.







