హైదరాబాద్, వెలుగు:పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు తవ్వే ఫార్మ్‌‌ పాండ్లను(ఊటకుంటలు) ఆదాయ వనరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్థలం వృథా అవుతుందనే బెంగ లేకుండా, ప్రతి గుంట స్థలాన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సరికొత్తగా ‘ఎకో-ఫార్మ్ పాండ్’ విధానానికి రూపకల్పన చేసింది.

‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘విలేజ్ బేస్డ్ గ్రోత్ అండ్​ రూరల్ యాక్సిలరేషన్ మిషన్’ కింద దీనిని అమలు చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీవోలకు శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది.

సాధారణంగా చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూమిలో కుంటలు తవ్వితే సాగు భూమి తగ్గిపోతుందని వెనుకంజ వేస్తుంటారు. ఫార్మ్ పాండ్ తవ్వితే ఆ స్థలం వృథా అవుతుందని భావిస్తారు. ఈ ఆలోచనను మార్చేలా ప్రభుత్వం అనేక నమూనాలను రూపొందించింది.

వర్షాభావ పరిస్థితులు, ‘ఎల్-నినో’ ప్రభావాన్ని తట్టుకుంటూనే.. కుంటలోని నీటిలో చేపల పెంపకం, గట్లపై పంటలు, పండ్ల తోటలు, కూరగాయలు, కంది, పశుగ్రాసం సాగు చేయడం ద్వారా రైతు కుటుంబానికి నిరంతర జీవనోపాధి కల్పించడమే దీని ఉద్దేశం.

అయితే, ఈ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేసేలా ఐదు ప్రభుత్వ శాఖలను అనుసంధానించింది. గ్రామీణాభివృద్ధి శాఖ వీబీ -జీ రామ్​జీ స్కీమ్​లో భాగంగా ఫార్మ్ పాండ్ తవ్వకం, గట్ల నిర్మాణం, అవసరమైన మొక్కల సరఫరా, నిర్వహణకు సాయం చేయనుంది. మత్స్యశాఖ నాణ్యమైన చేప పిల్లల ఎంపిక, ఉత్పత్తి యూనిట్లకు సాంకేతిక సాయం, రోగ నివారణ, మార్కెటింగ్ మద్దతు ఇవ్వనుంది.

ఉద్యానవన శాఖ ఆఫీసర్లు నాణ్యమైన పండ్ల మొక్కలు, కూరగాయల విత్తనాలు, పందిళ్ల ఏర్పాటుకు సాంకేతిక సలహాలు అందిస్తారు. ఇక పశుసంవర్ధక శాఖ గట్లపై బహువార్షిక పశుగ్రాసం కోసం రాయితీపై విత్తనాలు, గడ్డి పిలకల పంపిణీ, పాడి పోషణపై ఉచిత శిక్షణ, వైద్య సేవలు అందించనుంది. సెర్ప్ ఆధ్వర్యంలో పాడి పశువులు, జీవాలు ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని మహిళా రైతులను గుర్తించి బ్యాంక్ లింకేజీ కల్పిస్తుంది.

పొలం గట్లపై పండ్ల మొక్కలు పండించుకునే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. బొప్పాయి, అరటి, కొబ్బరి, ఉసిరి, జామ, మునగ సాగు చేయవచ్చు. అలాగే కూరగాయలు, తీగ జాతులైన పందిరి విధానంలో బీర, కాకర, సొరకాయలతోపాటు మిరప, టమాట, బంతిపూలు, వాణిజ్య పంటలైన కంది సాగు చేసుకోవచ్చు.

గట్ల లోపలి, బయటి వాలు భాగాల్లో నేపియర్, సెస్బేనియా గడ్డి పెంపకం చేపట్టవచ్చు. పాండ్‌‌లో నిల్వ ఉండే నీటి కాలాన్ని బట్టి చేప పిల్లలను పెంచుకునే వీలు కల్పించారు. అయితే, ఆసక్తి గల రైతులు గ్రామపంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ లేదంటే ఎంపీడీవో ఆఫీస్​లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

త్వరలోనే ఆన్‌‌లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. సాంకేతిక సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేసి అంచనాలు రూపొందిస్తారు. గ్రామసభ ఆమోదం తర్వాత పనులు మంజూరు చేస్తారు.