కడప వైఎస్‌ఆర్ సర్కిల్‌లో ఉన్న వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఐదు రోజులు నిర్వహించే ఏపీఎల్ క్రికెట్ పండుగ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీల కోసం స్టేడియంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. కార్యక్రమాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
స్టేడియంను నూతనంగా నవీకరించి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ మెరుగైన ఆటలను నిర్వహించి, దీనిని అధునాతన మైదానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు. భవిష్యత్తులో సౌకర్యాలను మరింత పెంచి, కడప స్టేడియంలో మరిన్ని మ్యాచ్‌లు జరిగేలా చూస్తామని భరత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవాళీ పోటీలకు కూడా కడప వేదిక కావాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి శ్రీనివాస్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గిరీష్ డోంగ్రి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జై కిషన్, గేమ్ డెవలప్మెంట్ మేనేజర్ ఎమ్మెస్ కుమార్ హాజరయ్యారు. స్థానికంగా కడప క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ముని కుమార్ రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్, స్టేడియం కమిటీ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ సంజయ్ కుమార్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీఎల్ మ్యాచ్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా సినీ నేపథ్య గాయని సునీత తన గానమాధుర్యంతో అందరినీ అలరించారు. సినిమాల్లో ఆలపించిన గీతాలతో పాటు ఇతర పాటలను పాడి ప్రేక్షకులలో ఉత్తేజాన్ని నింపారు.






