వేములవాడలో మంగళవారం బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు తన నివాసంలో 25 మంది కార్యకర్తలతో కలిసి రక్తదానం చేశారు. 'ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు' అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న సమయంలో ప్రభుత్వం నీళ్లు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.
గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చల్మెడ తీవ్రంగా ఖండించారు. పంటలు ఎండిపోతున్నాయని ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నిస్తే.. వారిని కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయని సీఎం అన్నారని గుర్తుచేశారు. రైతుల కష్టాలను కించపరిచేలా మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి సిగ్గుచేటని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై కూడా చల్మెడ మండిపడ్డారు. మంత్రి పదవి కోసం స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లను వెంటనే పంటపొలాలకు మళ్లించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డితో పాటు రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి రామచందర్ సహా పలువురు మండల నాయకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.






