పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం కంటి వైద్య శిబిరం జరిగింది. కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సహకారంతో స్థానిక లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరానికి ఎంపీడీవో వేముల సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వయసు పైబడిన వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీవో సుమలత సూచించారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆమె అభినందించారు. నిరుపేదల కోసం ఏటా రెండుసార్లు శిబిరాలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ శిబిరానికి సుమారు వందమంది రోగులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. రేకుర్తి కంటి దవాఖాన ఆప్తమాలజిస్ట్ ప్రభాకర్ రోగులను పరీక్షించారు. పరీక్షల్లో కంటి లోపాలు ఉన్నట్లు గుర్తించిన 32 మందిని, శస్త్ర చికిత్సల కోసం ప్రత్యేక బస్సుల్లో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖానకు తరలించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాగేటి రాజేశ్వరి, ఉప సర్పంచ్ ఎలిగేటి మల్లేశం, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చింతపండు నర్సింగం, ప్రోగ్రాం చైర్మన్ తన్నీరు రాజేందర్, క్లబ్ కార్యదర్శి కట్ట రమేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.








