83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ తన వృత్తి పట్ల అంకితభావాన్ని చాటుకున్నారు. ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 18 (KBC 18) షూటింగ్‌లో భాగంగా ఆయన ఏకంగా 24 గంటల పాటు నిరవధికంగా పని చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక బ్లాగ్ ద్వారా స్వయంగా వెల్లడించారు.
షూటింగ్ మొదటి రోజు ఉదయం 7 గంటలకు మొదలై, మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ఎక్కడా ఆగకుండా కొనసాగింది. ఆగస్టు 10న KBC 18 ప్రసారం ప్రారంభం కానున్న నేపథ్యంలో, నిర్ణీత గడువులోగా షూటింగ్ పూర్తి చేయాల్సిన అవసరం ఉండటంతో ఈ సుదీర్ఘ షిఫ్ట్‌లో పాల్గొన్నట్లు అమితాబ్ తెలిపారు.
పనిలో ఆలస్యం జరిగితే తన స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకే సమయానికి పని పూర్తి చేశానని ఆయన సరదాగా పేర్కొన్నారు. 2000లో మొదలైన ఈ షోకు మూడో సీజన్ మినహా మిగిలిన అన్ని సీజన్లలో అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించారు.
ప్రస్తుతం అమితాబ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ నటిస్తున్న ఆయన, కల్కి చిత్రంలో తన పాత్రతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన కల్కి 2 చిత్రానికి సిద్ధమవుతున్నారు.








