మంచిర్యాల జిల్లా జన్నారంలోని జ్యోతి గార్డెన్‌లో జూలై 16న జరిగిన ‘సర్’ కార్యకర్తల సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్ల నిర్మాణాల కోసం ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అటవీ అధికారులు అడ్డుకుంటే తిరగబడాలని కార్యకర్తలకు సూచించారు. వాగులు, గోదావరి రేవుల నుంచి ఇసుకను తీసుకురావాలని, ఎవరైనా అడ్డు వస్తే చూసుకుందామని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, జన్నారంలో ఇసుక రవాణాను ప్రశ్నించిన ఒక నాయకుడిని ఉద్దేశించి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్థానిక వాట్సాప్ గ్రూపులో పరుష పదజాలంతో మెసేజ్‌లు చేశారు. ఈ విషయాన్ని ఒక టీవీ ఛానల్ ప్రముఖంగా ప్రసారం చేయగా, దానిపై ఎమ్మెల్యే స్పందిస్తూ సదరు ఛానల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే వాట్సాప్ గ్రూపులో అసభ్యకరంగా మెసేజ్‌లు చేయడమే కాకుండా, వార్త ప్రసారం చేసిన ఛానల్‌పై నోరు పారేసుకోవడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ బాటలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నడుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.








