విజయనగరం జిల్లా చరిత్రలో దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతోంది. 1983లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పర్యటించిన తర్వాత, మళ్లీ ఏ ప్రధానమంత్రి అధికారిక హోదాలోనూ ఈ జిల్లాను సందర్శించలేదు. 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ విజయనగరానికి వచ్చినప్పటికీ, ఆయన అప్పటికి ప్రధాని కాకపోవడంతో ఈ పర్యటనకు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలతో పాటు లాజిస్టిక్స్, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రధాని రాక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని ఎన్డీఏ వర్గాలు పేర్కొంటుండగా, రాజకీయంగా కూడా ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది.
జిల్లా ప్రజలు ఈ పర్యటన ద్వారా కొత్త పెట్టుబడులు రావాలని, అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలని ఆశిస్తున్నారు. ఇందిరా గాంధీ తర్వాత నరేంద్ర మోదీ రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుందని స్థానికులు భావిస్తున్నారు.








