చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని వంటి AI టూల్స్ అతిగా వాడటం వల్ల మనిషి ఆలోచనా శక్తి కోల్పోయి మతిమరుపు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకన్ల వ్యవధిలోనే సమాధానాలు ఇచ్చే ఈ టెక్నాలజీపై అధికంగా ఆధారపడటాన్ని శాస్త్రవేత్తలు 'కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్'గా పిలుస్తున్నారు. ప్రతి చిన్న పనికీ AI ని ఆశ్రయించడం వల్ల మెదడుకు అవసరమైన వ్యాయామం తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటలీలోని సీనా యూనివర్శిటీకి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ సిమోన్ రోస్సీ చేసిన అధ్యయనం ప్రకారం, విమర్శనాత్మక ఆలోచన లేకుండా AI ని వాడటం మెదడు అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. నిరంతరం ఆలోచించడం, విశ్లేషించడం, గుర్తుంచుకోవడం వంటి పనులు తగ్గిపోతే మెదడు చురుకుదనం క్షీణించి చివరికి డిమెన్షియా (మతిమరుపు) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

విద్యార్థులపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయం స్పష్టమైంది. ఎస్సేలు రాయమని మూడు గ్రూపులుగా విభజించిన విద్యార్థుల్లో, AI సాయంతో రాసిన వారు కొంతకాలం తర్వాత తాము రాసిన విషయాలను గుర్తుచేసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. మరోవైపు, స్వయంగా ఆలోచించి రాసిన విద్యార్థుల మెదడు కార్యకలాపాలు అద్భుతంగా ఉన్నాయని రీసెర్చర్లు గుర్తించారు.

అయితే, AI పూర్తిగా ప్రమాదకరమని కాకుండా, సరైన పద్ధతిలో వాడితే అది మనిషి సామర్థ్యాన్ని పెంచే మంచి టూల్ అని నిపుణులు అంటున్నారు. ప్రతి చిన్న ఆలోచననూ AI కి అప్పగించకుండా జాగ్రత్త పడాలని, లేదంటే భవిష్యత్తులో మనం ఆలోచించే శక్తినే దానికి కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.