కట్టంగూర్ మండలం పామనగుండ్లలో అధికారులు రాసే విద్యుత్ రికార్డులకు, రైతులకు అందుతున్న కరెంట్‌కు మధ్య భారీ తేడా ఉందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బయటపెట్టారు. సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌లో రోజుకు 17 నుంచి 18 గంటల త్రీఫేజ్, మరో 6 నుంచి 7 గంటల సింగిల్ ఫేజ్ విద్యుత్ ఇస్తున్నట్లు చూపిస్తున్నారని, కానీ వాస్తవానికి రైతులకు రోజుకు 8 నుంచి 10 గంటలు కూడా కరెంట్ రావడం లేదని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆయన సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌ను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని మీడియా ముందు పెట్టారు. బ్రేక్‌డౌన్ వల్ల గంటల తరబడి విద్యుత్ నిలిచిపోయినా, రికార్డుల్లో మాత్రం కొద్ది నిమిషాల అంతరాయం మాత్రమేనని నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పై అధికారుల ఆదేశాల మేరకే ఆపరేటర్లు ఇలా తప్పుడు లెక్కలు రాస్తున్నట్లు తమకు చెప్పినట్లు చిరుమర్తి తెలిపారు.

లో వోల్టేజీ, తరచుగా వచ్చే అంతరాయాల వల్ల మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా యాప్ విధానం వల్ల యూరియా, ఎరువులు సకాలంలో అందడం లేదని, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలులోనూ జాప్యం చోటు చేసుకుంటోందని ఆరోపించారు. కాళేశ్వరం, ఏఎంఆర్పీ ప్రాజెక్టులను సక్రమంగా వాడకపోవడంతో కాల్వలకు నీరు లేక చెరువులు ఎండి, భూగర్భ జలాలు పడిపోతున్నాయని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల రక్తం పొలాల్లో చల్లాలంటూ దారుణంగా మాట్లాడుతున్నారని, కానీ ఆంధ్రాకు నీళ్లు పారుతుంటే చేతులు నలుపుకుంటూ కూర్చున్నారని చిరుమర్తి ధ్వజమెత్తారు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు, ఎరువులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిశీలనలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచ్ వడ్డె మాధవీ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.