కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలో అటవీ హక్కు పత్రాలు ఉన్న గిరిజన రైతులపై అటవీ అధికారులు వ్యవసాయం చేయకుండా ఆంక్షలు విధించారు. సాగు కోసం తీసుకెళ్లిన ట్రాక్టర్‌ను అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ఆదివారం ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వెళ్లిన రైతుల పట్ల ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. “మీ జాతి మారదు” అంటూ కులం పేరుతో దూషించడమే కాకుండా, ఎంపీ, ఎమ్మెల్యే లేదా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకున్నా తనకు భయం లేదని ఆయన హెచ్చరించినట్లు రైతులు తెలిపారు.
మళ్లీ కార్యాలయానికి వస్తే సిబ్బందితో బయటకు గెంటిస్తానని ఎఫ్‌ఆర్‌ఓ బెదిరించారని రైతులు ఆరోపించారు. దీంతో ఉడుంపూర్ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్త నేతృత్వంలో గ్రామస్తులు, గిరిజన రైతులు కడెం ఎస్సై సాయికిరణ్ మరియు ఖానాపూర్ సీఐ సత్యనారాయణను కలిసి ఫిర్యాదు చేశారు.
ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉడుంపూర్ గ్రామస్తులు, పోడు సాగు చేస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








