రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలులేని ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా (22ఏ జాబితా)లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించడానికి ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
ఈ జాబితాలో భూమి ఉందనే కారణంతో రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి, అర్హులైన వారికి ఎటువంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి పలు కీలక సూచనలు చేశారు. సంబంధిత భూమి 22ఏ జాబితాలోకి ఎందుకు చేరింది, అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన కోరారు.
అంతేకాదు, భూమి ప్రస్తుత వాస్తవ పరిస్థితి, హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు మరియు ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలను అన్నింటినీ సరిచూసుకోవాలని మంత్రి సూచించారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.








