హైదరాబాద్‌లోని టీజీపీసీబీ (తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి) కార్యాలయంలో ‘పవర్ సర్క్యులారిటీ ఎక్స్‌‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ’ అనే అంశంపై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ జి. రవి, సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) రీజినల్ డైరెక్టర్ వరలక్ష్మి, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

2030 నాటికి భారీ స్థాయిలో ఎండ్ ఆఫ్ లైఫ్ బ్యాటరీలు అంటే పనికిరాకుండా పోయిన బ్యాటరీలు వ్యర్థాలుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ సమయానికి వీటిని రీసైక్లింగ్ చేయడం పెద్ద సవాలుగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ వ్యర్థాలు నేరుగా భూమిలో కలవకుండా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ సుందర్ మాయవన్ సూచించారు.

కేవలం రీసైక్లింగ్‌పైనే కాకుండా, వాడి పడేసిన బ్యాటరీలను మళ్లీ ఉపయోగించే సెకండ్-లైఫ్ అప్లికేషన్స్ మరియు రీపర్పసింగ్ పద్ధతులపై దృష్టి సారించాలని నిపుణులు కోరారు. పరిశ్రమల్లో తయారైన బ్యాటరీలను వాడిన తర్వాత, వాటిలోని విలువైన ఖనిజాలను వెలికితీసి కొత్త బ్యాటరీల తయారీకి వాడడాన్ని ‘గ్రేవ్-టు-క్రాడెల్’ అని పిలుస్తారని సీఎస్‌ఐఆర్-ఎన్‌ఎమ్‌ఎల్ (నేషనల్ మెటలర్జికల్ లేబొరేటరీ) శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిమా మెశ్రామ్ వివరించారు. ఈ విధానం ద్వారా సహజ వనరులను కాపాడుతూ పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా టీజీపీసీబీ సెక్రటరీ రవి మాట్లాడుతూ, ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాల గురించి వివరించారు. 2030 నాటికి ప్రజా రవాణాను పూర్తిగా విద్యుద్దీకరించడం, నెట్-జీరో ఉద్గారాలు అంటే కార్బన్ డయాక్సైడ్ విడుదల సున్నాకు చేర్చడం, గ్రీన్ ఎనర్జీ విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు.

ఈ వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలు, సిఫార్సులను ఒక నివేదిక రూపంలో సిద్ధం చేయనున్నారు. వీటిని 2026 సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగనున్న వరల్డ్ సర్క్యూలర్ ఎకనమిక్ ఫోరంలో సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.