ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీతో పాటు ఎన్‌డీయే కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 2029లోపు యూసీసీని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఎన్‌డీయే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో యూసీసీ అమలు దిశగా చర్యలు మొదలయ్యాయని, వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు మిగిలిన రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేస్తామని ఆయన వివరించారు.
తీవ్రవాదంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని షా పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలు తీవ్రవాదం పట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. భద్రతతో పాటు వివిధ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు.
2014 నుంచి దేశంలో అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు తావులేకుండా పాలన సాగుతోందని అమిత్ షా అన్నారు. 'ఇండియా ఫస్ట్' అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తుందని, వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల జాబితా నుంచి భారత్ ఇప్పుడు టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. దేశ జీడీపీ 7.8 శాతంగా నమోదైందని ఆయన పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం అదుపు, ఈశాన్య భారత సమస్యల పరిష్కారం వంటి ఎన్నో ఏళ్ల నాటి సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని షా వివరించారు. మరోవైపు, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప్ అభియాన్' అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.








