అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2027 వన్డే ప్రపంచకప్‌ను అక్టోబర్ 2న మొదలుపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గాంధీజీకి దక్షిణాఫ్రికాతో ఉన్న అనుబంధం, ఆయన అహింసా సిద్ధాంతాలకు నివాళిగా ఈ తేదీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ షెడ్యూల్‌పై ICC నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మొదట అక్టోబర్ 8న టోర్నీని ప్రారంభించాలని ICC భావించింది. అయితే, తాజా మార్పుల ప్రకారం అక్టోబర్ 2నే టోర్నీని మొదలుపెట్టి, వార్మప్ మ్యాచ్‌లను అంతకుముందే నిర్వహించాలని చూస్తోంది. ఈ మెగా టోర్నీ నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీ 50 రోజుల పాటు సాగుతుంది. దక్షిణాఫ్రికాలోని 8 నగరాలు, జింబాబ్వేలోని 3 నగరాలు, నమీబియా రాజధాని విండ్‌హోక్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే 10 జట్లు అర్హత సాధించగా, మిగిలిన నాలుగు జట్లను వచ్చే ఏడాది నిర్వహించే క్వాలిఫయర్ టోర్నీ ద్వారా ఎంపిక చేస్తారు.
ఈసారి టోర్నీ ఫార్మాట్‌లో కూడా మార్పులు చేశారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్న మూడు జట్లు ముందుగా సూపర్ సిరీస్ అనే చిన్న లీగ్‌లో తలపడతాయి. ఆ విజేత మిగిలిన 11 జట్లతో కలిసి ప్రధాన దశలో ఆడుతుంది.






