ప్రతిరోజూ వంట చేసేటప్పుడు పీ పొంగడం లేదా ఆహార పదార్థాలు కారణంగా గ్యాస్ స్టవ్ బర్నర్లపై మలినం చేరుతుంది. చాలా మంది స్టవ్ బాహ్య భాగాన్ని మాత్రమే తుడుచుకుని, బర్నర్లలోని చిన్న రంధ్రాలను విస్మరిస్తారు. దీనివల్ల అన్నం, నూనె, మసాలాలు ఆ రంధ్రాల్లో ఇరుక్కుపోయి మంట సరిగ్గా రాకపోవడమే కాకుండా, వంటకు ఎక్కువ సమయం పట్టి గ్యాస్ సిలిండర్ కూడా త్వరగా అయిపోతుంది.

ఈ సమస్యను పరిష్కరించడానికి నిమ్మరసం ద్రావణం ఒక మంచి మార్గం. గోరువెచ్చని నీటిలో కొంత నిమ్మరసం కలిపి, ఆ నీటిలో బర్నర్లను కొంతసేపు నానబెట్టాలి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మురికిని వదులు చేస్తుంది, తర్వాత పాత బ్రష్‌తో రుద్ది కడిగితే బర్నర్లు శుభ్రమవుతాయి. అలాగే, ఒక చెంచా బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ తయారు చేసి, బర్నర్లపై పూసి పది నిమిషాలు ఉంచాలి. తర్వాత పాత టూత్‌బ్రష్‌తో గట్టిగా రుద్దడం వల్ల మొండి జిడ్డు, నలుపుదనం తొలగిపోతాయి.

మరో సులభమైన పద్ధతిలో, నీటి కుళాయి కింద బర్నర్ను ఉంచి, సూది లేదా సేఫ్టీ పిన్‌తో ఒక్కొక్క రంధ్రాన్ని శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల లోపల గట్టిగా పేరుకుపోయిన ఆహార కణాలు తొలగి రంధ్రాలు పూర్తిగా తెరుచుకుంటాయి. అదేవిధంగా, వెనిగర్ మరియు నీటి మిశ్రమంలో బర్నర్లను నానబెట్టి, తర్వాత బ్రష్‌తో క్లీన్ చేస్తే చిక్కటి మురికి, మసి త్వరగా వదిలి మంట వేగంగా వస్తుంది.

బర్నర్లను కడిగిన వెంటనే అవి తడిగా ఉన్నప్పుడు స్టవ్‌కు అమర్చకూడదు, ఎందుకంటే తడి వల్ల దహన క్రియ సరిగ్గా జరగక మంట రాదు. కాబట్టి కడిగిన భాగాలను ఎండలో పెట్టడం లేదా పొడి గుడ్డతో పూర్తిగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి మరియు సరైన నీలి రంగు మంటను పొందడానికి కనీసం వారానికి లేదా పక్షం రోజులకు ఒకసారైనా ఈ పద్ధతిలో బర్నర్లను శుభ్రం చేసుకోవడం మంచిది.