తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల స్వయంప్రతిపత్తిని పెంచేందుకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3)ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు పన్నులు, ఇతర వనరుల ద్వారా వచ్చే సొంత ఆదాయం ప్రభుత్వ ట్రెజరీలో జమ అయ్యేది.
ఈ పద్ధతి వల్ల అత్యవసర అభివృద్ధి పనులకు నిధులు తీసుకోవడంలో సర్పంచులు, స్థానిక అధికారులకు ఆలస్యం జరిగేది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు, ఇకపై గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీతో సంబంధం లేకుండా నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసుకునేలా చట్ట సవరణకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఈ మార్పును తక్షణమే అమలు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేయనుంది.
మరోవైపు, జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు కొత్త పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పఠాన్‌చెరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని నిర్ణయించింది. అలాగే, బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో పాటు, ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి జరిగిన లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.








