భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర పరిపాలనకు విజన్ లేదని ఆరోపించారు. అధికారులంతా అసత్య ప్రచారాల్లో మునిగిపోయి, నిజమైన సమస్యలకు పరిష్కారం చూడటం లేదని విమర్శించారు.
ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పులను కడుతున్నామని మాట్లాడుతున్నా, ఇది వాస్తవాలను కప్పిపుచ్చుకోవడమేనని వివరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు చర్చకు వస్తానని చెప్పగా, కేటీఆర్ సిద్ధమని చెప్పిన తర్వాత మంత్రి వేదిక మార్చడం సిగ్గుచేటని అన్నారు.
రూ.4 వేల పెన్షన్ మరియు రూ.15 వేల రైతుబంధు పథకాలు ఏమైపోయాయో ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు మూడు విడుతల్లో ఇవ్వాల్సిన రైతుబంధును ఎగ్గొట్టారని, మొత్తం భూమికి ఇవ్వాలని చెప్పి నాలుగు ఎకరాలకు మాత్రమే ఇచ్చారని సిగ్గుచేటని అన్నారు.
జిల్లా ప్రధాన వైద్యశాలలో పరిస్థితులు ప్రశ్నార్థకమయ్యాయని ఆయన అన్నారు. పోస్టుమార్టం కోసం దవాఖానలోని మార్చురీకి తీసుకువెళ్లిన మృతదేహాల మాంసాన్ని కుక్కలు ఎత్తుకుపోతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు.








