లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కీలక నిర్ణయం తీసుకుని, తన వెబ్‌సైట్ మరియు పోర్టల్ ద్వారా క్రెడిట్ కార్డులతో ప్రీమియం చెల్లించే అవకాశాన్ని పూర్తిగా తొలగించింది. ఈ మేరకు 15 రోజుల క్రితమే ఆప్షన్‌ను రిమూవ్ చేసింది. దీంతో ఇకపై ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం చెల్లించలేరు.
ఇప్పటివరకు ఎల్‌ఐసీ వెబ్‌సైట్, యాప్‌లో క్రెడిట్ కార్డు ద్వారా ప్రీమియం చెల్లిస్తే వచ్చే గేట్ వే, కన్వీనియన్స్ ఛార్జీలను ఎల్‌ఐసీయే భరించేది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డుల ద్వారానే చెల్లింపులు చేయడంతో సంస్థపై ఫీజుల భారం పెరిగిపోయింది. దీంతో చివరికి ఈ ఆప్షన్‌ను తొలగించాలని ఎల్‌ఐసీ నిర్ణయించుకుంది.
అయితే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే లాంటి యూపీఐ యాప్స్ మరియు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం చెల్లించే సౌకర్యం కొనసాగుతుందని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. కానీ ఈ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే ఛార్జీల భారాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించే సమయంలో ఈ ప్లాట్‌ఫామ్‌లు ఏడీఆర్ ఛార్జీలను విధిస్తుంటాయి.
ఒకవేళ ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ప్రీమియం కట్టాలంటే, ఎల్‌ఐసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు విధానాల్లో చెల్లింపులు చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.








