జులై 2026లో UPI ద్వారా జరిగిన చెల్లింపుల విలువ రూ.29.88 లక్షల కోట్లకు చేరుకున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ లావాదేవీల విలువగా నిలిచింది. గతేడాది జులైతో పోలిస్తే ఈ లావాదేవీల విలువ 19 శాతం పెరిగింది.
గత నెల జూన్‌లో 22.72 బిలియన్ లావాదేవీలు నమోదు కాగా, జులైలో అవి 23.66 బిలియన్లకు పెరిగాయి. మే 2026లో లావాదేవీల విలువ రూ.29.9 లక్షల కోట్లుగా ఉంది. జులై గణాంకాలు ఆ స్థాయికి దగ్గరగా ఉంటూ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ బలంగా కొనసాగుతోందని సూచిస్తున్నాయి.
పేనియర్‌బై మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్ మాట్లాడుతూ, ఇండియా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థకు UPI బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు. కస్టమర్ల నమ్మకాన్ని, అవగాహనను మరింత పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం UPI సేవలు యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్‌తో సహా సుమారు 10 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఈ వ్యవస్థ, రెమిటెన్స్‌లను పెంచడంతో పాటు గ్లోబల్ ఫిన్‌టెక్ రంగంలో ఇండియాను బలోపేతం చేస్తోందని ఆయన తెలిపారు.








