పీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిమితిని పెంచే ఉద్దేశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలనే డిమాండ్లపై వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ పడినట్లయింది.

ప్రస్తుత ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం బేసిక్ శాలరీ రూ.15 వేలలోపు ఉన్నవారు ఖచ్చితంగా పీఎఫ్ పరిధిలోకి రావాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ జీతం పొందేవారు కంపెనీ, ఉద్యోగి మధ్య ఒప్పందం మేరకు స్వచ్ఛందంగా మాత్రమే చేరగలరు. ఫలితంగా రూ.15 వేల పైన జీతం తీసుకునేవారికి పీఎఫ్ ప్రయోజనాలు అందడం లేదు.

కార్మిక సంఘాలు మాత్రం ఈ పరిమితిని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. చివరిగా 2014లో ఈ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు జరగలేదు. ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని కార్మికులు కోరుతున్నారు.

అయితే పరిమితిని రూ.25 వేలకు పెంచితే కేంద్ర ఖజానాపై అదనపు భారం పడుతుందని అంచనా. ఈపీఎస్ పరిధిలోకి వచ్చే సబ్సిడీ కోసం ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో పాటు కంపెనీలపై కూడా కాంట్రిబ్యూషన్ భారం పెరుగుతుంది.

మరోవైపు ఉద్యోగుల ఇన్ హ్యాండ్ శాలరీ తగ్గిపోయే అవకాశముంది. దీనివల్ల తక్షణ ఖర్చులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ కారణాల దృష్ట్యా కేంద్రం ముందడుగు వేయడం లేదని తెలుస్తోంది.