పది రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని పొలాలు నెర్రెలు బారుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు కురియకపోవడంతో, బోర్లపై ఆధారపడి పంటలు వేసిన రైతులు నింగి వైపు చూస్తున్నారు. కోటగిరి, నవీపేట, పొతంగల్, బోధన్ రూరల్, డిచ్‌పల్లి ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
వ్యవసాయాశాఖ అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో మొత్తం 5,58,430 ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. ఇందులో 4.10 లక్షల ఎకరాల్లో వరి, 53 వేల ఎకరాల్లో మక్క, 23 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. అయితే, వర్షాభావం కొనసాగితే ఈ పంటలు గట్టెక్కడం కష్టమని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గోదావరిలో నీళ్లు లేకపోవడంతో అలీసాగర్ ప్రాజెక్టుతో పాటు యంచ, నందిగామ, నిజాంపూర్, నాళేశ్వర్ లిఫ్టులు ప్రారంభించలేదు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ)లో నీళ్లు ఉన్నా, విడుదలపై స్పష్టత లేకపోవడంతో రైతులు ప్రభుత్వ చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. చెరువులు నింపడానికి, పంటలకు నీళ్లందించడానికి ఈ నీటిని వినియోగించే అవకాశం ఉందని రైతులు కోరుతున్నారు.
బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ డివిజన్లలో విత్తనాలు విత్తగా, నవీపేటలో 14 వేల ఎకరాల్లో, కోటగిరిలో 12 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. కానీ భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఆగిపోతున్నాయి. దీంతో ఏపుగా పెరిగిన పంటలు వాడిపోతుండగా, కొన్ని గ్రామాల్లో రైతులు కప్పకావడి ఆడుతూ, ప్రత్యేక పూజలు చేస్తూ వర్షాల కోసం మొక్కులు చెల్లిస్తున్నారు.





