పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు 36వ రోజుకు చేరుకోగా, మంగళవారం సుధనోటి, రావల్కోట్ ప్రాంతాల్లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 11 మంది తీవ్రంగా గాయపడటంతో ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులపై జరిగిన ఈ దమనకాండపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రావల్కోట్‌లోని ఈద్గా మైదానాన్ని పాక్ బలగాలు ఆక్రమించుకున్నాయని మండిపడుతున్న నిరసనకారులు, భారీ బహిరంగ సభ నిర్వహించారు. సుమారు 70,000 మంది హాజరైన ఈ సభలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నేత సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ, గత 78 ఏళ్లుగా పాకిస్తాన్ చెప్తున్న అబద్ధాలను బద్దలు కొట్టే సమయం వచ్చిందని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్ ప్రకారం ఇది వివాదాస్పద భూభాగమే తప్ప, పాకిస్తాన్ సొంత ప్రాంతం కాదని అమన్ ఖాన్ ధ్వజమెత్తారు. పీఓకే విద్యాసంస్థల్లో పాకిస్తాన్ పట్ల కృత్రిమ ప్రేమను నూరిపోస్తున్నారని, పర్వతాల వేడి, చలి తప్ప మిగిలిన పాఠ్యపుస్తకాల విషయాలన్నీ అబద్ధాలేనని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. పీఓకే భవిష్యత్తును నిర్ణయించే అధికారం కేవలం అక్కడి ప్రజలకే ఉందని ఆయన నొక్కి చెప్పారు.

బుధవారం (జూలై 15) జరగనున్న 'చలో ముజఫరాబాద్' కార్యక్రమం కోసం పూంచ్ డివిజన్ ప్రజలు రావల్కోట్‌కు భారీగా తరలివస్తున్నారు. జూలై 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రజలే స్వయంగా ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని అమన్ ఖాన్ తేల్చి చెప్పారు. ఐఎస్ఐ సెక్టార్ కమాండర్ బ్రిగేడియర్ ఫైక్ కార్యాలయం చుట్టూ ఫైళ్లతో తిరిగే రోజులు గతమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.

నిరసన నేతలు పాక్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కో-ఆర్డినేటర్ ఉమర్ నజీర్ మాట్లాడుతూ, ఈ పాదయాత్ర కేవలం 38 డిమాండ్ల కోసమో లేదా ఎఫ్‌ఐఆర్‌ల (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) రద్దు కోసమో కాదని స్పష్టం చేశారు. పీఓకే నియంత్రణ, బాధ్యతను పూర్తిగా అక్కడి ప్రజలకే అప్పగించాలనే ఏకైక లక్ష్యంతో ఈ మార్చ్ సాగుతోందని, ఈ పోరాటం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిందని ఆయన తెలిపారు.