సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు కువైట్‌తో కూడా ఇలాంటి ఒప్పందం కోసం సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో పాకిస్తానీ సైనికులు, యుద్ధ విమానాలు, డ్రోన్‌లు మరియు వాయు రక్షణ వ్యవస్థలను మోహరించడం వంటి అంశాలు ఉన్నాయి. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, యుద్ధ దళాలను పంపే అంశంపై ఎలాంటి ఒప్పందం కుదరలేదని పాకిస్తాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గతంలో సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులు జరిగినప్పుడు, పాకిస్తాన్ ఆ దేశానికి అండగా నిలవలేకపోయింది. సౌదీ చమురు క్షేత్రాలు, అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేసినా పాకిస్తాన్ నిస్సాహాయంగానే ఉండిపోయింది. దీంతో ఇప్పుడు కువైట్‌తో కుదుర్చుకోబోయే ఒప్పందం కూడా కేవలం కాగితాలకే పరిమితం అవుతుందా అనే అనుమానాలు రక్షణ రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం కువైట్ తన భద్రతను పటిష్టం చేసుకునే క్రమంలో కొత్త రక్షణ భాగస్వాముల కోసం అన్వేషిస్తోంది. ఇరాన్ దాడుల వల్ల కువైట్ తీవ్రంగా దెబ్బతింటున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌తో రక్షణ సహకారాన్ని పెంచుకోవాలని చూస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ ఇంధన భద్రత, పెట్టుబడులను ఆశిస్తుండగా, కువైట్ తన ఇంధనాన్ని పాకిస్తాన్‌లో నిల్వ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.
ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే గల్ఫ్ దేశాలపై పాకిస్తాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది భారత భద్రతా ఆందోళనలను మరింత పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మరోవైపు, టర్కీ-పాకిస్తాన్-సౌదీ అరేబియా త్రైపాక్షిక ఒప్పందంతో పాటు, బహ్రైయిన్, జోర్డాన్‌లతో కూడా రక్షణ సహకారంపై పాకిస్తాన్ దృష్టి సారించింది.








