కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి వార్తతో కుటుంబసభ్యులు భౌతికకాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో పాటు మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం తెలిపారు.
ముద్రగడ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ వార్త తెలియగానే కిర్లంపూడిలోని ఆయన నివాసానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ, తండ్రి వీర రాఘవరావు మరణానంతరం 1977లో జనతాపార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 1988లో రాజీవ్ గాంధీతో కలిసి కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్‌లో చేరి, 1989లో మంత్రి అయ్యారు.
1999లో కాకినాడ నుంచి లోక్‌సభకు గెలిచిన ముద్రగడ, తర్వాతి ఎన్నికల్లో పలుమార్లు ఓటమి చవిచూసి 2014 నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన ఆయన, 2016లో తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న రైలు దహనం ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.
2024 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరిన ముద్రగడ కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్తగా, కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా కొనసాగుతున్నారు.








