భారతీయ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 'తుంబాడ్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'తుంబాడ్ 2'లో నటి ఆలియా భట్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఆలియా భట్‌తో పాటు సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సోహమ్ షా ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
గతంలో ఈ చిత్రంలో సమంత లేదా జాన్వీ కపూర్ నటిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే బలమైన పుకారు కూడా ఉంది. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ కథానాయికగా ఆలియా భట్‌ను అధికారికంగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు, నిర్మాత సోహమ్ షా తన సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆలియా భట్ ఫోటోలను పంచుకుంటూ సోహమ్ షా స్వాగతం పలికారు. 'ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. తుంబాడ్ 2లోకి ఆలియా భట్ 'ప్రళయ దాటి'కి స్వాగతం. థియేటర్లలో కలుద్దాం' అని ఆయన రాశారు. ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించిన సందర్భంగా ఆలియా భట్ మాట్లాడుతూ, తొలి భాగం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. విడుదలైన సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకుల జ్ఞాపకాలలో నిలిచిపోయే అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించే సినిమాలు అరుదని, అందుకే ఈ అవకాశాన్ని అంగీకరించానని ఆమె అన్నారు.
2018లో విడుదలైన 'తుంబాడ్' చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, కాలక్రమేణా OTTలు, పైరసీ సైట్ల ద్వారా ప్రేక్షకుల మనసులను గెల్చుకుంది. ఇటీవల ఈ చిత్రాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేయగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. అయితే, మొదటి భాగానికి దర్శకత్వం వహించిన రాహి అనిల్‌ను ఈ సీక్వెల్ నుంచి తొలగించారు. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న 'తుంబాడ్ 2' 2027 డిసెంబర్ 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.







