పి.ఎస్.జె ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మిస్తున్న చిత్రం 'ఆలోచన'. ఈ సినిమాలో జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేందర్ చాచా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా స్నేహితుల రోజును పురస్కరించుకుని ఈ సినిమాలోని 'భజగోవిందం' పాటను చిన్న జీయర్ స్వామి విడుదల చేశారు. ఆది గురువు శంకరాచార్యులు రచించిన 'మోహ ముద్గర'లోని సంస్కృత శ్లోకాల సారాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులో అనువదించి ఈ పాటను రూపొందించారు. రచయిత ప్రతాప్ రాజులపల్లి ఈ పాటను అనువదించగా, వియాన్ సంగీతం అందించారు. గాయని మంగ్లీ ఈ పాటను ఆలపించారు.
వృద్ధాప్యంలో స్నేహితుల కలయిక, స్నేహం విలువలను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మురళి మోహన్, టీజర్‌ను విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. టి. సురేంద్ర రెడ్డి కెమెరా బాధ్యతలు చూడగా, ఆర్.ఎల్.వర్మ ఎడిటర్‌గా, గిరీష్ దేవాంగ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
మంచి కథాబలం ఉన్న 'ఆలోచన' సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.







