ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్ దశకు చేరుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చిలీ జట్టును 6-0 గోల్స్ తేడాతో చిత్తు చేసి భారత్ తుదిపోరుకు అర్హత సాధించింది.
ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. మరో సెమీ ఫైనల్‌లో షూటౌట్ ద్వారా అమెరికాను ఓడించి కివీస్ (న్యూజిలాండ్) కూడా ఫైనల్‌కు చేరుకుంది.
చిలీతో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ ఆరంభం నుంచే ఆక్రమణ దాడులు సాగించింది. ఆరో నిమిషంలోనే నవనీత్ కౌర్ తొలి గోల్ సాధించగా, 13వ నిమిషంలో ఆమె మరోసారి గోల్ చేసి జట్టుకు ఆధిక్యం కల్పించింది.
14వ నిమిషంలో దీపిక భారత్‌కు మూడో గోల్ అందించగా, 18వ నిమిషంలో ఆమె తన రెండో గోల్‌తో స్కోరును పెంచింది. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది.
ద్వితీయార్ధంలో కూడా భారత్ ఆధిక్యాన్ని కొనసాగించింది. నేహా, రుతుజాలు చెరో గోల్ చేయడంతో మొత్తం స్కోరు 6-0తో భారత్ విజయం ఖాయమైంది.








