డ్యాన్సర్ల అసోసియేషన్‌లో మధ్యవర్తులు డ్యాన్సర్ల డబ్బులను అన్యాయంగా దోచుకుంటున్నారని జానీ మాస్టర్ భార్య సుమలత ఆరోపించారు. ఈ మేరకు ఆమె నేడు ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. గత కమిటీలో కొన్ని ఫండ్స్ మిస్ యూజ్ అయ్యాయని, వాటిని ప్రశ్నించినందుకే తమపై విమర్శలు వస్తున్నాయని ఆమె వివరించారు.

జులై 12 ఆదివారం నాడు అసోసియేషన్‌లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవ పడ్డట్లు వచ్చిన వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. తాము కొట్టుకోలేదని, తిట్టుకోలేదని అది అబద్ధమని తేల్చి చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం చిరంజీవి సినిమా షూటింగ్ ప్లేస్‌కు తాను, శేఖర్ అన్న కలిసి వెళ్లామని, ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడి, తిని హ్యాపీగా ఉన్నామని జానీ మాస్టర్ చెప్పారు. అసోసియన్‌లోని సమస్యకు తమకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

అసోసియేషన్ వ్యవహారాలపై సుమలత మాట్లాడుతూ.. నిర్మాతల దగ్గర ఇన్ చార్జులు, పదవుల్లో ఉన్నవారు ఒక మొత్తం చెబుతున్నారని, కానీ డ్యాన్సర్లకు అంతకంటే తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డ్యాన్సర్లు నష్టపోతున్నారని, వాళ్లకు రావాల్సిన పూర్తి మొత్తం అందట్లేదని ఆమె వెల్లడించారు. గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పోటీ చేసిన జోసెఫ్ మాస్టర్ వర్గం ఏం చేసినా తప్పే అంటున్నారని, కానీ మీడియాలో వచ్చే వార్తలన్నీ అవాస్తవాలని ఆమె ఖండించారు.

మీడియా సంస్థలు వార్తలు ప్రచురించే ముందు నిజాలు తెలుసుకోవాలని, ఇష్టమొచ్చినట్లు థంబ్ నెయిల్స్ పెట్టకూడదని సుమలత హితవు పలికారు. అసోసియేషన్ పనులన్నీ లీగల్ గానే జరుగుతున్నాయని, తప్పుడు వార్తలతో డ్యాన్సర్లను రెచ్చగొట్టవద్దని కోరారు. శేఖర్ మాస్టర్ లేదా ఇతర డ్యాన్స్ మాస్టర్లు ఈ ఆరోపణలపై స్పందిస్తారా అనేది చూడాల్సి ఉంది.