భద్రాద్రి జిల్లా కేంద్రంలోని రామవరం మాతాశిశు ఆరోగ్య కేంద్రం (MCH)లో బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన పద్దం భవాని తన తొలి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా, వైద్యులు ఆమెను పరీక్షించి బెడ్ కేటాయించారు. సాధారణ కాన్పు కోసం వైద్యులు ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చారు.
అయితే, కాలకృత్యాలకు వెళ్తున్న సమయంలో భవాని నిల్చున్న చోటే శిశువు బయటకు వచ్చి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో నవజాత శిశువుకు స్వల్ప గాయాలయ్యాయి, ఇది అక్కడ ఉన్న ఇతర గర్భిణులను ఆందోళనకు గురిచేసింది.
శిశువు 2.90 కేజీల బరువుతో ఆరోగ్యంగానే ఉందని ఆసుపత్రి ఆర్‌ఎంవో సాగరిక తెలిపారు. భవానికి సాధారణ ప్రసవం అయ్యేలా తాము చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. గురువారం రోజున బీఆర్‌ఎస్ మహిళా విభాగం నేతలు ఆసుపత్రికి వెళ్లి భవానిని పరామర్శించారు.








