కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా, కొప్ప తాలూకా, కుంచూరు గ్రామంలో ఒక యువతి ఇంటి నుంచి మాయమైంది. తాను నిద్రపోతున్నట్లుగా కనిపించేందుకు ఆమె బెడ్‌పై ఉన్న బొమ్మకు దుప్పటి కప్పి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి హరిహరపుర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విద్యుత్‌శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసే జగదీశ్ కుమార్తె జలన్య ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ప్రస్తుతం కంప్యూటర్ క్లాస్‌కు వెళ్తోంది. ఇటీవల ఆమె తన తండ్రితో కలిసి శృంగేరి దేవస్థానానికి వెళ్లి వచ్చింది. అయితే, మరుసటి రోజున ఈ ఘటన చోటు చేసుకుంది.

మధ్యాహ్నమైనా కుమార్తె నిద్ర లేవకపోవడంతో జగదీశ్ గదిలోకి వెళ్లి చూశారు. అక్కడ బొమ్మకు దుప్పటి కప్పి ఉండటం చూసి ఆయన షాక్‌కు గురయ్యారు. తన కుమార్తె రహస్యంగా మొబైల్‌ఫోన్ వాడుతోందని, సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాల వల్లనే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

సినిమాల్లో హీరోయిన్లు చేసినట్లుగానే బొమ్మను నిద్రపోయినట్లు అమర్చి యువతి ఈ నాటకీయత సృష్టించింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.