అరబ్ దేశాల్లోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్యంతో ఉన్న ఒంటెల నోట్లో బతికున్న పాములను, కొన్నిసార్లు విషపూరితమైన కింగ్ కోబ్రాలను కూడా వేసి తినిపిస్తున్నారు. 'హయామ్' అనే వ్యాధి బారిన పడిన ఒంటెలు ఆహారం, నీరు తీసుకోవడం మానేసి బలహీనపడతాయని, సకాలంలో చికిత్స లేకపోతే ప్రాణాపాయం సంభవిస్తుందని స్థానికులు నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ ఒంటెల్లో ఈ సమస్య గర్భస్రావం లేదా మరణానికి దారితీయొచ్చనే భయంతో ఈ పురాతన పద్ధతిని వారు అనుసరిస్తున్నారు.

పామును ఒంటె నోట్లో వదిలిన తర్వాత, అది కడుపులోకి వెళ్లేలా నీరు తాగిస్తారు. పాము విషం శరీరంలోని వ్యాధికారకాలను నాశనం చేస్తుందని, దీంతో కొన్ని రోజుల్లోనే ఒంటె ఆరోగ్యం మెరుగుపడుతుందని స్థానికుల విశ్వాసం. గతంలో ఈ విధానం వల్ల కొన్ని ఒంటెలు కోలుకున్నాయని పెద్దలు చెప్పడంతో, వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు.

అయితే ఈ చికిత్సా పద్ధతికి మద్దతు ఇచ్చేలా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పశువైద్య నిపుణులు తేల్చి చెప్పారు. హయామ్ వ్యాధి ఇన్ఫెక్షన్లు, పరాన్నజీవులు లేదా కీటకాల కుట్టడం వల్ల వస్తుందని, దీనికి పశువైద్య చికిత్స మాత్రమే సరైన మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు. కేవలం సంప్రదాయం కొనసాగుతోందనే కారణంతో దీనిని వైద్యపరంగా సరైన చికిత్సగా పరిగణించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పూర్తిగా శాకాహార జంతువులైన ఒంటెలు సాధారణంగా గడ్డి, ఆకులు, పండ్లు మాత్రమే తింటాయి, పాములను వేటాడవు. ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఈ ఆచారానికి సంబంధించిన వీడియోలు విస్తృతంగా ాయి. అయితే ఆ వీడియోల మూలం నిర్ధారణ కాలేదని, అలాంటి వీడియోలను చూసి నమ్మకుండా శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల సూచనలను పాటించాలని పశువైద్యులు సూచిస్తున్నారు.