వానకాలం రావడంతో పంటలు వేసే పనిలో రైతులు బిజీగా ఉండగా, వారికి సాయపడేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా నిధుల విడుదలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిధుల విడుదలకు ఆమోదం లభించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 30వ తేదీన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తాలు జమ అవుతాయి.

మధిరలో జరగనున్న భారీ బహిరంగ సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా రైతుభరోసా నిధులను అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్ని ఎకరాల సాగుకు ఈ నిధులు అందించనున్నారనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

గత యాసంగి పంట సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు ఎకరాల పరిమితితోనే రైతుభరోసా నిధులను విడుదల చేసింది. అవి కూడా సరైన సమయానికి అందకపోవడంతో పాటు, యూరియా ఎరువుల కొరత కూడా తలెత్తింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.