పుణెలోని లోహగడ్ కోట సమీపంలో రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులకు చట్టం ప్రకారం కఠినమైన శిక్ష వేయాలని ప్రధాని నరేంద్రమోడీని కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ కోరారు. ఈ మేరకు ఆమె ప్రధానికి ఓ భావోద్వేగ లేఖ రాసి, విచారణను వేగవంతం చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తనకు సానుభూతి లేదా ప్రత్యేక సహాయం అవసరం లేదని, కేవలం న్యాయం కావాలని లేఖలో పేర్కొన్నారు. కుమారుడు పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని కలలు కన్నానని, కానీ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడని, తానే అతనికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్ మరణంతో తమ ఇల్లు నిశ్శబ్దంగా మారిందని, ఈ విషాదం తట్టుకోలేక 20 రోజుల్లోనే తన మామగారు కూడా ప్రాణాలు కోల్పోయారని లేఖలో వివరించారు.

కేతన్‌ను మరో కేసు ఫైల్‌లా మార్చేయొద్దని, అతను తనకు ప్రపంచమంతా అని రాఖీ అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు. ప్రతిరోజూ రాత్రి అతడి ఫోటోతో మాట్లాడుకుంటూ, ఒకరోజు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నానని ఆమె తెలిపారు.

కాగా, 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగడ్ కోట సమీపంలోని లోయలో పడిపోయి మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదమని భావించిన పోలీసులు, దర్యాప్తులో ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యగా గుర్తించారు. వివాహం ఇష్టం లేకపోవడంతో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి విహారయాత్ర పేరుతో తీసుకెళ్లి కేతన్‌ను కొండపై నుంచి తోసి హత్య చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నకొద్దీ పోలీసులకు నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.