యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్టీ నేత జక్కిడి ప్రభాకర్ ఫోటో లేకపోవడం వివాదానికి దారితీసింది. ఈ విషయమై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన ఫోన్ సంభాషణలో యాదవ, గౌడ సామాజిక వర్గాలను కించపరిచే వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేసాయి.
ఈ ఇద్దరి ఆడియోలు బయటకు రావడంతో పాటు, అందులో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్లు ప్రస్తావించబడటం కాంగ్రెస్ వర్గాల్లో కలవరం సృష్టించింది. ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి తాను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఏడు కోట్లు ఖర్చు చేశానని ఫోన్లో చెప్పుకోవడం, దాన్ని సభ్యత్వం కోసం చెల్లించినట్లు వివరించడంపై పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. సోషల్ మీడియాలో ఈ మాటలు పోస్టులు కొనుక్కోవడానికి వీలుగా ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది.
బీసీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మధుయాష్కితో పాటు ఎల్బీనగర్ కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ అధినాయకత్వంపై బీసీ నేతలు చర్యలు తీసుకోవాలని వత్తిడి పెంచారు. పరిస్థితి సీరియస్ అవడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లాకు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
వివాదం పెరగడంతో ప్రభాకర్ రెడ్డి తన మాటలతో ఎవరైనా నొచ్చుకుంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. బయటకు వచ్చిన ఆడియోలు ఏఐ (AI) సృష్టి అని ఆయన వాదించారు. మరోవైపు శివచరణ్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు. తాను బీసీలకు వ్యతిరేకం కాదని, తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్ పై సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
తండ్రీ కొడుకుల క్షమాపణలతో కథ ముగిసినట్టేనా లేక ఇంకా ఏదైనా ఉందా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.








